విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 37 డిగ్రీ కాలేజీలకు పక్కా భవనాలు

BC7News
By
1 Min Read

అమరావతి: రాష్ట్రంలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. సొంత భవనాలు లేని 37 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నట్లు శాసనసభలో ప్రకటించారు. ఒక్కో కాలేజీ నిర్మాణానికి దాదాపు రూ.15 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు.

ఆళ్లగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న అంశంపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రశ్నించగా.. అక్కడ 103 మంది విద్యార్థులు చదువుతున్నారని మంత్రి తెలిపారు. అవసరమైన భూమి అందుబాటులో ఉన్నందున కొత్త భవన నిర్మాణంతో పాటు ప్రహరీ గోడను కూడా నిర్మిస్తామని చెప్పారు. కాలేజీలకు అవసరమైన సిబ్బంది, ల్యాబ్స్, కంప్యూటర్లు, ఫర్నిచర్‌ను దశలవారీగా సమకూరుస్తామని వెల్లడించారు.

ప్రతి నియోజకవర్గానికి ఒక మోడల్ లైబ్రరీ

గ్రంథాలయాలను విద్యార్థులకు మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు ఏర్పాటు చేయనున్నట్లు లోకేశ్‌ తెలిపారు. మంగళగిరి మోడల్ లైబ్రరీ విజయవంతమైన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

మంగళగిరి లైబ్రరీలో రాత్రి వేళల్లోనూ సుమారు 300 మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని మంత్రి వివరించారు. గ్రంథాలయాలకు రావాల్సిన సెస్సు నిధులు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

image

మూడు ప్రాంతాల్లో భారీ లైబ్రరీలు

అమరావతిలో దేశంలోనే అత్యుత్తమ సెంట్రల్ లైబ్రరీ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని లోకేశ్‌ చెప్పారు. గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్, తెలుగు కల్చరల్ సెంటర్‌తో అనుసంధానంగా దీనిని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

అలాగే విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ కేంద్రంగా జోనల్ లైబ్రరీ, రాయలసీమలో మరో అత్యాధునిక జోనల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పుస్తక పఠనం ద్వారా పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుందని, డిజిటల్ పరికరాలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో గ్రంథాలయాలు ఉపయోగపడతాయని మంత్రి పేర్కొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article