నల్గొండ: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించినట్లు సమాచారం. ఆమె పనిచేస్తున్న నాగార్జున పబ్లిక్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. టీసీ విషయంలో ఏర్పడిన కక్ష, డబ్బు అవసరం హత్యకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
రూపారెడ్డి (42) జేబీ కాలనీలోని తన ఇంట్లో ఆగస్టు 11-12 మధ్య హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో ఆమెపై సుమారు 27 సార్లు దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో భర్త హైదరాబాద్‌లో ఉండటంతో.. ఆమె ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో బంధువులు, సహోద్యోగులు ఇంటికి వెళ్లి చూడగా దారుణం బయటపడింది.

అనుమానాలకు తెర తీసిన సీసీ కెమెరా
ఇంట్లో విలువైన వస్తువులు కనిపించకపోవడంతో మొదట ఈ ఘటన వెనుక వ్యక్తిగత కక్ష ఉండొచ్చని పోలీసులు భావించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఇంటి సమీపంలో ఓ బాలుడు అనుమానాస్పదంగా సంచరిస్తున్న దృశ్యాలు పోలీసులకు లభించినట్లు సమాచారం.
దీంతో దర్యాప్తు దిశ మారింది. కొందరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారించగా.. వారిలో ఓ విద్యార్థి కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.
రూ.4 లక్షల నగదు చోరీ?
ప్రిన్సిపాల్ తనకు టీసీ ఇవ్వడంతో ఆమెపై కక్ష పెంచుకున్నానని, మరోవైపు డబ్బు అవసరం కూడా ఉండటంతో హత్యకు పాల్పడినట్లు నిందితుడు చెప్పినట్లు సమాచారం. హత్య అనంతరం ఇంట్లో నుంచి సుమారు రూ.4 లక్షల నగదు మాయమైనట్లు విచారణలో తేలినట్లు తెలుస్తోంది.
ఈ హత్యలో ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు పాల్గొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రూపారెడ్డి కుమారుడి ఫిర్యాదు మేరకు కొండమల్లేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు, నిందితుల పాత్రపై పోలీసుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.