ఆసిఫాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం కింద కుట్టు మిషన్ల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రిని ప్రశ్నించారు. రూ.2.50 కోట్లతో చేపట్టనున్న సమేల రోడ్డు, రూ.1.50 కోట్లతో నిర్మించనున్న పాతగూడ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని అన్నారు. మంత్రి స్వయంగా ప్రారంభించిన పనులే ముందుకు సాగకపోతే నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
దీనిపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఘాటుగా స్పందించారు. 2018 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎన్ని ఇళ్లు నిర్మించారో చెప్పాలని కోవ లక్ష్మిని ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం తీవ్రతరమైంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కల్యాణలక్ష్మి, రైతుబంధు వంటి పథకాలను సమర్థంగా అమలు చేశామని కోవ లక్ష్మి పేర్కొన్నారు. గత ప్రభుత్వంపై మంత్రి చేస్తున్న వ్యాఖ్యలు సరికావని ఆమె అన్నారు.
అనంతరం జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు. రాష్ట్ర ఖజానాపై అప్పుల భారం ఉండటంతో ప్రతి నెలా సుమారు రూ.6 వేల కోట్లు వడ్డీల చెల్లింపులకే ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా కొన్ని అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు.

అయితే పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలోనే మంత్రి, ఎమ్మెల్యే మధ్య చోటుచేసుకున్న ఈ మాటల యుద్ధం ఆసిఫాబాద్‌లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.