ఫాంహౌస్‌లోనే కుట్రలు.. బీఆర్ఎస్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

BC7News
By
3 Min Read

మూడు రోజుల పాటు అసెంబ్లీని అడ్డుకున్నారు.. అధికారులను, స్పీకర్‌ను దూషించారంటూ ఆరోపణలు

హైదరాబాద్: శాసనసభ కార్యకలాపాలను సజావుగా సాగనివ్వకుండా బీఆర్ఎస్ నేతలు కుట్రలు పన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఆయన ఫాంహౌస్‌లోనే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునే వ్యూహాలు రూపొందించారని సీఎం వ్యాఖ్యానించారు. అధికారం కోల్పోయినా ఆ పార్టీ నేతల అహంకారం మాత్రం తగ్గలేదని విమర్శించారు.

శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) సమావేశంలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించారు. మూడు రోజుల పాటు బీఆర్ఎస్ సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారని, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఎం మండిపడ్డారు.

image

‘స్పీకర్‌ను తీవ్ర పదజాలంతో దూషించారు’

అసెంబ్లీలో అధికారుల పట్ల బీఆర్ఎస్ సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సభాపతిని తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు.. మహిళా అధికారుల సమక్షంలో టీషర్టులు విప్పి నిరసన వ్యక్తం చేయడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు.

నిరసనకు వచ్చిన దళితులు నడిచిన నేలను బీఆర్ఎస్ నేతలు శుద్ధి చేశారంటూ సీఎం తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది దళితులను అవమానించడమేనని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచి చోటుచేసుకున్న అవాంఛనీయ ఘటనలపై ప్రభుత్వం తరఫున సమగ్ర విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.

బీఆర్ఎస్ సభ్యుల నిరసనలను సమర్థంగా ఎదుర్కొంటూ సభా కార్యక్రమాలు కొనసాగించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి అభినందించారు.

‘కాంగ్రెస్ వల్లే రాజకీయంగా ఎదిగారు’

కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయంగా ఎదిగిన సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వంటి నాయకులు ఇప్పుడు అదే పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సీఎం విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వకపోయి ఉంటే వారు రాష్ట్రస్థాయి నాయకులుగా ఎదిగేవారా? అని ప్రశ్నించారు.

పోలీసు అధికారులపై బీఆర్ఎస్ నేతల వైఖరిపైనా రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పోలీసు సిబ్బందిలో కూడా కేటీఆర్‌కు తన ప్రతిబింబమే కనిపిస్తున్నట్టుందని, అందుకే అధికారులపై అంతటి ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.

‘వెయ్యి రోజుల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే ఈ సమావేశాల ఉద్దేశమని సీఎం తెలిపారు.

చారిత్రక భవనంలో శాసన మండలిని పునఃప్రారంభించడంతో పాటు అసెంబ్లీలోని సెంట్రల్ హాల్‌ను ప్రారంభించి దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు పేరు పెట్టినట్లు వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శంగా నిలిచిందని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం నిర్వహించబోయే జనాభా లెక్కల్లోనూ తెలంగాణ కులగణన నమూనాను అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సూచించారు.

‘ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి’

‘ఎస్ఐఆర్’ పేరుతో లక్షలాది ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో వయోజనుల జనాభా 103 కోట్లుగా ఉంటే.. ఓటర్ల జాబితాలో మాత్రం 88 కోట్ల మంది మాత్రమే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కల ప్రకారం దాదాపు 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయని సీఎం వివరించారు.

తిరిగి ఎమ్మెల్యేగా గెలవాలనుకునే ప్రతి ఒక్కరూ తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు పరిరక్షణను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాపై నిరంతరం దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.

అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు క్రమం తప్పకుండా హాజరై చర్చల్లో చురుకుగా పాల్గొనాలని రేవంత్ రెడ్డి సూచించారు. స్థానిక సమస్యలను సభ దృష్టికి తీసుకురావడంతో పాటు హాజరు శాతాన్ని కూడా మెరుగ్గా కొనసాగించాలని ఆదేశించారు.

📄 Generate e-Paper Clip
Share This Article