ఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు భారీ ఏర్పాట్లు

BC7News
By
2 Min Read

పుతిన్, జిన్‌పింగ్ సహా అగ్రనేతల రాక.. కట్టుదిట్టమైన భద్రత

న్యూఢిల్లీ: 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని న్యూఢిల్లీ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు ప్రపంచంలోని ప్రముఖ దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరుకానున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా పలువురు అగ్రనేతలు పాల్గొననుండటంతో ఢిల్లీలో భద్రతను భారీగా పెంచారు.

బ్రిక్స్ సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య దేశాల ప్రతినిధులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో తదితరులు హాజరయ్యే నేతల్లో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా సదస్సులో పాల్గొననున్నారు.

image

ప్రపంచ సమస్యలపై కీలక చర్చలు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఆహార భద్రత, ఇంధన భద్రత, ఆరోగ్యం, విపత్తుల నిర్వహణ, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సహకారం, కీలక సరఫరా వ్యవస్థలను మరింత పటిష్టం చేయడం వంటి అంశాలు సదస్సు అజెండాలో ఉన్నాయి. ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, హార్ముజ్ జలసంధి పరిస్థితులు, అంతర్జాతీయ వాణిజ్య విధానాలపైనా నేతలు చర్చించే అవకాశం ఉంది.

భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సు ‘రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ’ అనే అంశాల చుట్టూ కొనసాగనుంది. సదస్సు ముగింపులో ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ను విడుదల చేయనున్నారు.

మోదీ-పుతిన్ భేటీపై ఆసక్తి

బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య రక్షణ, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, అంతరిక్షం, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

బ్రిక్స్ విస్తరణ తర్వాత తొలిసారిగా భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ శిఖరాగ్ర సదస్సు అంతర్జాతీయంగా కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.

📄 Generate e-Paper Clip
Share This Article