తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు మరింత పెరుగుతున్నాయా? మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు పార్టీ అంతర్గత రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఢిల్లీలో ఆమె చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కొత్త చర్చకు తెరతీశాయి.
తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. అలాంటప్పుడు తనకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఎందుకు ఇచ్చారని సురేఖ ప్రశ్నించినట్లు సమాచారం.
అంతేకాదు.. “పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్‌రెడ్డి ఎలా చెబుతారు?” అంటూ ఆమె ప్రశ్నించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై వచ్చిన కమీషన్ల ఆరోపణల అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దీంతో సురేఖపై మంత్రి పదవికి రాజీనామా చేయాలనే ఒత్తిడి పెరిగితే.. ఆమె పార్టీకి భిన్నంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? అనే చర్చ మొదలైంది.
ఇది కేవలం ఒత్తిడి రాజకీయమా? లేక కొండా కుటుంబం వద్ద నిజంగానే ‘ప్లాన్ బి’ ఉందా? అనే ప్రశ్న ఇప్పుడు కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
అటు సురేఖ.. ఇటు రాజగోపాల్‌రెడ్డి!
ఇదే సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచాయి. వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన.. బయట నుంచి వచ్చిన వారు తెలంగాణ కాంగ్రెస్‌ను కబ్జా చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
అంతేకాదు.. తెలంగాణలో మళ్లీ వైఎస్సార్ పాలన తీసుకొస్తామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో సురేఖ వ్యాఖ్యలు.. తెలంగాణలో రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు.. ఒకే సమయంలో తెరపైకి రావడంతో కాంగ్రెస్‌లో ఏదైనా కొత్త సమీకరణం మొదలైందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్సీ కోసం మొదలైన వ్యూహం.. మంత్రి పదవికే ఎసరా?
కాంగ్రెస్ వర్గాల్లో మరో చర్చ కూడా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. భర్తకు ఎమ్మెల్సీ పదవి కోసం మొదలైన ఒత్తిడి వ్యూహం.. చివరకు కొండా సురేఖ మంత్రి పదవికే ఇబ్బందిగా మారిందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కుమార్తె వ్యాఖ్యలపై తొలినాళ్లలోనే సురేఖ స్పష్టమైన ఖండన చేసి ఉంటే వివాదం ఇంత దూరం వచ్చేది కాదని కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే.. కొండా సురేఖ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుంది? కాంగ్రెస్ అధిష్ఠానం తదుపరి ఏ నిర్ణయం తీసుకుంటుంది?