హైదరాబాద్: మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో భూసేకరణ చట్టం-2013 నిబంధనలను ప్రభుత్వం, ఎంఆర్‌డీసీఎల్ పాటించడం లేదని మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. భూసేకరణకు ముందు బాధితులకు అధికారిక నోటీసులు జారీ చేసి, వారి అభ్యంతరాలు, అభిప్రాయాలను నమోదు చేయడంతో పాటు గ్రామ సభలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. ఇవేవీ సక్రమంగా జరగడం లేదని వారు అంటున్నారు.
మూసీ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి భూసేకరణ ప్రక్రియలో పారదర్శకత లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గాంధీసరోవర్ ప్రాజెక్టు పరిధిలో ఇండ్లు, స్థలాలు కోల్పోయే వారికి సంబంధించి ఎంఆర్‌డీసీఎల్ నిర్వహిస్తున్న సమావేశాలపై కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అధికారిక నోటీసులు ఇవ్వకుండా ఫోన్ ద్వారా సమావేశానికి రావాలని సమాచారం ఇచ్చారని, ప్రతి కాలనీ నుంచి కేవలం ముగ్గురిని మాత్రమే పిలుస్తూ వేర్వేరు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇలా ప్రజలను విడగొట్టి మాట్లాడటం వల్ల తమ అభ్యంతరాలను పూర్తిస్థాయిలో వెల్లడించే అవకాశం ఉండదని వారు చెబుతున్నారు.
భూసేకరణ చట్టం ప్రకారం బాధితుల అభిప్రాయాలను తీసుకుని, వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అందరినీ ఒకేచోట సమావేశపరిచి పారదర్శకంగా అభిప్రాయాలు సేకరించకుండా ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లలో పరిమిత సంఖ్యలో వ్యక్తులతో సమావేశాలు నిర్వహించడంపై ప్రశ్నలు సంధిస్తున్నారు.
అధికారి పునర్నియామకంపైనా ప్రశ్నలు
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు నోటిఫికేషన్ సమయంలో రాజేంద్రనగర్ ఆర్డీవోగా పనిచేసిన కొప్పుల వెంకట్‌రెడ్డి వ్యవహారశైలిపైనా బాధితులు గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారని పేర్కొంటున్నారు. ఆయనను కామారెడ్డి డిప్యూటీ కలెక్టర్‌గా ప్రమోషన్‌పై బదిలీ చేసినప్పటికీ, అనంతరం ఎంఆర్‌డీసీఎల్‌లోకి తీసుకోవడంపై కూడా వారు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఆయన తిరిగి ఎంఆర్‌డీసీఎల్‌లో చేరిన తర్వాత ప్రాజెక్టు సంబంధిత కార్యకలాపాలు వేగవంతమయ్యాయని స్థానికంగా ప్రచారం జరుగుతోందని బాధితులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.

నిబంధనలు పాటిస్తే సహకరిస్తాం
మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, అయితే భూసేకరణ చట్టం-2013 నిబంధనలను పూర్తిగా పాటించాలని బాధితులు స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా, పరిమిత సంఖ్యలో వ్యక్తులను పిలిచి సమావేశాలు నిర్వహించకుండా.. ప్రభావిత కుటుంబాలందరి అభిప్రాయాలను అధికారికంగా నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
బాపూఘాట్ నుంచి హిమాయత్‌సాగర్, గండిపేటతో పాటు మూసీ పరివాహక ప్రాంతంలోని అన్ని కాలనీల ప్రజలను కలుపుకొని తమ హక్కుల కోసం పోరాడుతామని వారు చెబుతున్నారు. ఎన్ని సమావేశాలు నిర్వహించినా, తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇండ్లు, భూములు తీసుకోవడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేస్తున్నారు.