హైదరాబాద్: సినీ పైరసీ కేసులో అరెస్టయిన ఐబొమ్మ రవి అలియాస్ ఇమంది రవి మరోసారి వార్తల్లోకి వచ్చారు. తన బ్యాంక్ ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేయడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పేర్కొంటూ ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.
తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు తనకు చెందిన బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారని రవి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఖాతాల్లో సుమారు రూ.3 కోట్లు నిలిచిపోయాయని, బ్యాంక్ ఖాతాలు పనిచేయకపోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారిందని కోర్టుకు తెలిపారు. ఫ్రీజ్ చేసిన ఖాతాలను తిరిగి వినియోగించుకునే అవకాశం కల్పించాలని ఆయన కోరినట్లు సమాచారం.
ఈ పిటిషన్‌పై నాంపల్లి 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది.
పైరసీ కేసులో రవి అరెస్ట్
విశాఖపట్నంకు చెందిన ఇమంది రవి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం. అనంతరం ఐబొమ్మ పేరుతో నడిచిన వెబ్‌సైట్లకు సంబంధించిన పైరసీ వ్యవహారంలో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో డబ్బు సంపాదించినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి.

చాలాకాలంగా విదేశాల్లో ఉన్న రవి.. వ్యక్తిగత కారణాలతో హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యతో విభేదాలు, విడాకుల వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్‌కు వచ్చినట్లు కూడా సమాచారం.
బెట్టింగ్ యాప్‌ల అంశంపైనా దర్యాప్తు
సినిమా పైరసీతో పాటు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించిన అంశాలు కూడా కేసు దర్యాప్తులోకి వచ్చాయి. ఐబొమ్మ వెబ్‌సైట్లకు వచ్చే భారీ ట్రాఫిక్‌ను బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌ల వైపు మళ్లించినట్లు రవిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
దాదాపు మూడు నెలల పాటు జైలులో ఉన్న రవికి 2026 ఫిబ్రవరి 17న తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఫిబ్రవరి 18న చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.
తాజాగా బ్యాంక్ ఖాతాల ఫ్రీజ్ అంశంపై నాంపల్లి కోర్టును ఆశ్రయించడంతో మరోసారి ఐబొమ్మ రవి పేరు చర్చనీయాంశంగా మారింది.