బండి సాయి భగీరథ్‌కు హైకోర్టు ఊరట.. పోక్సో కేసు కంటెంట్ ప్రసారాలపై ఆదేశాలు

BC7News
By
1 Min Read

హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించిన అంశాలను మీడియా, సోషల్ మీడియా వేదికల్లో ప్రసారం చేయడంపై న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

image

కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని పిటిషన్

తనకు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ మంజూరైనప్పటికీ, కొన్ని టీవీ ఛానెళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ కేసుకు సంబంధించిన అంశాలను ప్రసారం చేస్తున్నాయని భగీరథ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ప్రసారాలు తమ కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నాయని ఆరోపించారు.

మీడియా ట్రయల్‌పై అభ్యంతరం

జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. భగీరథ్ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. వ్యక్తిగత కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోక్సో కేసుతో ముడిపెట్టి ప్రసారం చేయడం ద్వారా మీడియా ట్రయల్ జరుగుతోందని, ఇది వ్యక్తిత్వ హననానికి దారితీస్తోందని వాదించారు. ఇప్పటికే ఉన్న అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించి, డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని కోరారు.

సోషల్ మీడియా సంస్థలకు కీలక సూచనలు

వాదనలు విన్న హైకోర్టు.. ఈ కేసుకు సంబంధించిన కంటెంట్‌ను ప్రసారం చేయవద్దని టీవీ ఛానెళ్లు, ప్రైవేట్ వ్యక్తులు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఆదేశించింది. గూగుల్, మెటా, ఎక్స్ వంటి సంస్థలు సంబంధిత కంటెంట్‌ను తక్షణమే తొలగించి, డిజిటల్ రికార్డులను భద్రపరచాలని సూచించింది.

పలువురికి హైకోర్టు నోటీసులు

ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర సమాచార, ఎలక్ట్రానిక్స్ శాఖలు, తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ, సోషల్ మీడియా సంస్థలు, పలువురు ప్రైవేట్ వ్యక్తులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

బండి సాయి భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.

📄 Generate e-Paper Clip
Share This Article