హైదరాబాద్: తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల వ్యవహారం రాజకీయంగా వేడెక్కుతోంది. ప్రభుత్వం అనేక కాలనీలు, భూములను రాత్రికి రాత్రే 22ఏ జాబితాలో చేర్చడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
సమస్యలను పరిష్కరించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చిక్కులు సృష్టిస్తోందని విమర్శించిన ఆయన.. 22ఏ నిషేధిత భూముల జాబితాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి మరోసారి దరఖాస్తులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా, తప్పుగా చేర్చిన భూములను ప్రభుత్వం స్వయంగా జాబితా నుంచి తొలగించాలని అన్నారు.

22ఏ వ్యవహారంలో జరిగిన తప్పిదానికి నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. మంత్రి పదవిలో కొనసాగితే ఈ భూముల వ్యవహారంపై ప్రభుత్వంపై ప్రజల్లో అనుమానాలు మరింత పెరుగుతాయని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం చేసిన తప్పును అధికారులపైకి నెట్టడం సరికాదని ఆయన అన్నారు. భూములను 22ఏ జాబితాలో చేర్చాలని ఎవరు ఆదేశించారో ప్రభుత్వం స్పష్టం చేయాలని ప్రశ్నించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ కూడా పనిచేయడం లేదని ఆరోపించారు.
2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యూఎల్సీని రద్దు చేసిన తర్వాత కొన్ని భూములు పట్టా భూములుగా మారాయని హరీశ్ రావు పేర్కొన్నారు. జీఓల ద్వారా మినహాయింపులు పొందిన హెచ్ఎండీఏ, హుడా భూములను కూడా 22ఏ జాబితాలో చేర్చడంతో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
కల్యాణలక్ష్మి పథకంపై కూడా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. పెళ్లి సమయంలో అందాల్సిన ఆర్థిక సాయం ఆలస్యమవుతోందని, పిల్లలు పుట్టిన తర్వాత సాయం అందే పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు.
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ పాలనలో జరిగిన తప్పులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హరీశ్ రావు అన్నారు. 22ఏ భూముల అంశాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించి, కేసీఆర్ నాయకత్వంలో పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.