తెలంగాణ నుంచి అమెరికాకు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతున్న నేపథ్యంలో వారికి మరిన్ని వీసా స్లాట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. హెచ్-1బీ వీసా నిబంధనలను సరళీకృతం చేయడంతో పాటు, అమెరికాలో చదువుతున్న విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
బుధవారం న్యూఢిల్లీలో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. వీసా అపాయింట్‌మెంట్ల కోసం విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించిన ఆయన, దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ఇంటర్వ్యూ స్లాట్లను పెంచాలని కోరారు.
హెచ్-1బీ వీసా నిబంధనల్లో మార్పులు చేపట్టే ముందు సంబంధిత సమాచారాన్ని ముందుగానే వెల్లడించాలని కూడా సీఎం సూచించారు. దీనివల్ల అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణకు చెందిన ఐటీ, సాంకేతిక నిపుణులు తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని వివరిస్తూ ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, స్టార్టప్‌ల రంగాల్లో అమెరికా కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆహ్వానించారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ కార్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.
అలాగే అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు తెలంగాణలోని విద్యాసంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని పరిశోధన, ఇన్నోవేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
దాదాపు అరగంట పాటు కొనసాగిన ఈ సమావేశంలో రాయబారి సెర్గియో గోర్ ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న భారతీయ భాషల్లో తెలుగు ఒకటిగా గుర్తింపు పొందుతోందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.