సీఎం ఇల్లే 22-ఏ జాబితాలోనా? తప్పు జరిగిందన్న మంత్రి పొంగులేటి

BC7News
By
2 Min Read

హైదరాబాద్: నిషేధిత భూముల జాబితా రూపకల్పనలో పొరపాట్లు జరిగినట్లు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంగీకరించారు. 22-ఏ జాబితాలోకి ప్రైవేట్‌, పట్టా భూములు చేరడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యపై తనకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. సమస్యకు కారణమైన తప్పిదాలపై ప్రజలకు క్షమాపణలు తెలిపారు.

సచివాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గతంలో జారీ చేసిన జీవోలు, ఉత్తర్వుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడం వల్ల అనేక భూములు తప్పుగా నిషేధిత జాబితాలోకి వెళ్లాయని వివరించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందన్నారు.

757 ఫిర్యాదులు

ఇప్పటివరకు నాలుగు జిల్లాల నుంచి 757 దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి తెలిపారు. మేడ్చల్‌లో యూఎల్‌సీ భూములకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. గతంలోనే క్లియర్‌ చేసిన భూములను కూడా అధికారులు ప్రభుత్వ భూములుగా పరిగణించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.

image

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ద్వారా విక్రయించిన ప్లాట్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో అవి కూడా నిషేధిత జాబితాలో చేరాయని తెలిపారు. అన్ని కేసులను పరిశీలించి అర్హత ఉన్న భూములను జాబితా నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు.

35-38 వేల పార్సిళ్లకు చిక్కులు

ఫారెస్ట్‌, ఎండోమెంట్‌ భూములతో పాటు సీఎస్‌-7, సీఎస్‌-14కు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయని మంత్రి తెలిపారు. కొన్ని భూములకు గతంలోనే జీవోలు, మెమోల ద్వారా క్లియరెన్స్‌ ఇచ్చినా వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయకపోవడంతో సుమారు 35-38 వేల పార్సిళ్లు నిషేధిత జాబితాలోకి వచ్చినట్లు వెల్లడించారు.

అల్విన్‌, ఆస్‌బెస్టాస్‌ కాలనీల్లో ఒకే సర్వే నంబర్‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములు ఉండటంతో ప్రైవేట్‌ స్థలాలు కూడా 22-ఏ జాబితాలోకి వెళ్లాయని చెప్పారు. వాటిని త్వరగా తొలగిస్తామని తెలిపారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి విషయంలోనూ ఇదే పొరపాటు

జూబ్లీహిల్స్‌ సొసైటీకి చెందిన 356 ప్లాట్లు కూడా ఇదే తరహాలో నిషేధిత జాబితాలోకి వచ్చినట్లు మంత్రి వెల్లడించారు. గతంలో అవి ప్రభుత్వ ఖాతాలో ఉండగా.. సొసైటీకి కేటాయించిన ఉత్తర్వులు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఈ ప్లాట్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసం ఉన్న స్థలం కూడా ఉందని మంత్రి తెలిపారు. దీనిని కూడా తప్పిదంగానే పేర్కొంటూ, సంబంధిత ఉత్తర్వులను అప్‌లోడ్‌ చేసి సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

ఎలాంటి సమస్య లేని భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేసి ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. మొత్తం వ్యవహారంపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి కేసుల వారీగా పరిష్కరిస్తామని చెప్పారు. ఫిర్యాదుల కోసం 18005994788 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

📄 Generate e-Paper Clip
Share This Article