హైదరాబాద్: తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR)-2026 ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి సోమవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఇంటింటి సర్వే అనంతరం రూపొందించిన ఈ జాబితాలో సుమారు 73.3 లక్షల మంది ఓటర్ల వివరాలు ASD (Absent, Shifted, Dead, Duplicate) కేటగిరీలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. సుమారు 2.65 కోట్ల మంది తమ వివరాలను అందించారు. ఇది మొత్తం ఓటర్లలో 78.3 శాతంగా ఉంది. మిగిలిన 73.3 లక్షల మంది వివరాలు అందుబాటులో లేకపోవడంతో వారిని గైర్హాజరు, చిరునామా మారిన, మరణించిన లేదా నకిలీ ఓటర్ల కేటగిరీల్లో గుర్తించారు. వీరిలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలోనే 19.4 లక్షల మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఓటర్లకు కీలక సూచనలు
ఓటర్లు తమ పేరు ముసాయిదా జాబితాలో ఉందో లేదో ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవచ్చు. ఇందుకోసం తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వెబ్‌సైట్‌లోని ‘Special Intensive Revision-2026’ విభాగాన్ని లేదా ఎన్నికల సంఘం ఓటర్ పోర్టల్‌ను ఉపయోగించుకోవచ్చు.
ముసాయిదా జాబితాలో పేరు లేకపోతే సంబంధిత ధ్రువపత్రాలతో ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత గడువులోగా తమ అభ్యంతరాలు, వివరాలను సమర్పించాలి.
బూత్ నంబర్ మారిందా?
రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరగడంతో చాలామంది ఓటర్ల పాత పోలింగ్ బూత్ నంబర్లు మారే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కొత్త బూత్‌ల కేటాయింపు జరిగింది.
తమ ప్రస్తుత బూత్ నంబర్ తెలుసుకోవడానికి ఓటర్లు ఎన్నికల సంఘం సెర్చ్ పోర్టల్‌ను ఉపయోగించవచ్చు. EPIC నంబర్ ద్వారా లేదా పేరు, బంధువు పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేసి పోలింగ్ కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు. అనంతరం సంబంధిత బూత్ నంబర్‌కు సంబంధించిన ఓటర్ల జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మరో 92 లక్షల మందికి నోటీసులు
ముసాయిదా జాబితా పరిశీలనలో మరో 61.4 లక్షల దరఖాస్తుల్లో లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా 32.3 లక్షల మంది ఓటర్ల వివరాలు పాత జాబితాలతో సరిపోలకపోవడంతో అన్‌మ్యాప్డ్ ఓటర్లుగా గుర్తించారు. ఈ రెండు కేటగిరీల్లో కలిపి దాదాపు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు
ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించే ప్రక్రియ ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు కొనసాగుతుంది. అనంతరం వచ్చిన దరఖాస్తులు, అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించనున్నారు. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 36,353కి పెరగడంతో, మెజారిటీ ఓటర్లకు బూత్ నంబర్లు మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అందువల్ల ప్రతి ఓటరు తుది జాబితా వెలువడేలోపు తమ పేరు, పోలింగ్ కేంద్రం వివరాలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని సూచించారు.