హైదరాబాద్: నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాసు బ్రహ్మానంద రెడ్డి (కేబీఆర్) నేషనల్ పార్కు పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 18 నుంచి వన్-వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నిర్మాణ పనుల కారణంగా పలు ప్రాంతాల్లో రహదారుల వెడల్పు తగ్గిందని, అదే సమయంలో వాహనాల రద్దీ పెరిగిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. దీంతో కేబీఆర్ పార్క్ చుట్టూ ఇరువైపులా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని చెప్పారు.
ఈ సమస్యకు పరిష్కారంగా ఒకే దిశలో వాహనాల రాకపోకలను అనుమతించేలా వన్-వే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా పైలట్ ట్రయల్స్ నిర్వహించి, వాటి ఫలితాల ఆధారంగా ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికలో అవసరమైన మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
కొత్త ట్రాఫిక్ విధానం అమలుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద లేన్ మార్కింగ్, లేన్ ఛేంజర్లు, వాహనదారులకు దిశను సూచించే సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. వాహనదారులు అయోమయానికి గురికాకుండా అవసరమైన చోట స్పష్టమైన మార్గదర్శకాలను అందుబాటులో ఉంచుతున్నారు.
ట్రాఫిక్‌ను నిరంతరం పర్యవేక్షించేందుకు 24 గంటల పాటు ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉంటారని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చోట సిబ్బందిని మోహరించనున్నారు.

సీసీటీవీలు, డ్రోన్లతో పర్యవేక్షణ
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, సీసీటీవీ నెట్‌వర్క్‌ను వినియోగించనున్నారు. అవసరమైన సందర్భాల్లో డ్రోన్ల ద్వారా కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తారు.
ట్రాఫిక్ పరిస్థితులను బట్టి మార్గాల్లో అవసరమైన మార్పులు, సర్దుబాట్లు వెంటనే చేపట్టేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. నావిగేషన్ యాప్‌లలోనూ కొత్త ట్రాఫిక్ మార్గాలకు అనుగుణంగా మార్పులు చేసినట్లు తెలిపారు.
వాహనదారులకు కీలక సూచనలు
హెచ్-సిటీ నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ఈ వన్-వే విధానం కొనసాగుతుందని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
నిర్దేశించిన మార్గాల్లోనే వాహనాలు నడపాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ముఖ్యంగా వ్యతిరేక దిశలో వాహనాలు నడపడం, వన్‌వేలో రాంగ్ రూట్‌లో వెళ్లడం చేయవద్దని హెచ్చరించారు.