రూ.1,100 కోట్లతో 1,000 పడకల డా.ఎంసీఆర్‌ టిమ్స్‌.. నేడు రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

BC7News
By
1 Min Read

హైదరాబాద్‌ ఎర్రగడ్డలో నిర్మించిన డా.ఎంసీఆర్‌ టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి సోమవారం ప్రజలకు అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాయంత్రం 4.30 గంటలకు ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

22.6 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,100 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో మొత్తం 1,000 పడకలు ఉన్నాయి. ఐదు బ్లాకులతో నిర్మించిన ఈ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేశారు.

ప్రారంభానికి ముందే ఆసుపత్రిలో ట్రయల్‌ రన్‌ చేపట్టారు. డే కేర్‌ సేవలను కూడా ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 250 మంది రోగులకు వైద్య సేవలు అందుతున్నాయి. గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ తదితర ఆసుపత్రుల నుంచి వచ్చిన సిబ్బందితో పాటు కొత్తగా నియమించిన వైద్య సిబ్బంది సేవలకు సిద్ధంగా ఉన్నారు.

image

ఆసుపత్రి నిర్వహణకు మాజీ డీఎంఈ డా.ఎ.నరేంద్రకుమార్‌ను ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా, మాజీ ఏడీఎంఈ డా.మహబూబ్‌ ఖాన్‌ను ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా నియమించారు.

ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆదివారం పరిశీలించారు. కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ట్రాఫిక్‌, భద్రత, ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

📄 Generate e-Paper Clip
Share This Article