తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గడువు పొడిగించింది. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు దాఖలు చేసేందుకు అక్టోబర్ 7వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఇప్పటికే పొడిగించిన షెడ్యూల్ ప్రకారం అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణకు గడువు సెప్టెంబర్ 16తో ముగియాల్సి ఉంది. అయితే ఓటర్ల జాబితా సవరణకు మరింత సమయం అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి వేర్వేరుగా లేఖలు రాశారు.
వారి విజ్ఞప్తులను పరిశీలించిన ఈసీ.. గడువును మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో పరిశీలించుకోవడంతో పాటు, ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు ప్రజలకు అదనపు సమయం లభించింది.

కొత్త షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 7 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం వాటిని పరిశీలించి పరిష్కరించిన తర్వాత నవంబర్ 9వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.
ఈ గడువు పొడిగింపుతో కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునే వారికి, ఓటర్ల జాబితాలో పేరు, చిరునామా తదితర వివరాల్లో మార్పులు లేదా సవరణలు చేసుకోవాలనుకునే వారికి మరింత అవకాశం లభించినట్లయింది.