మేడ్చల్: బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొండం ఆంజనేయులు ముదిరాజ్ నియమితులయ్యారు. రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్య ఆయన నియామక పత్రాన్ని విడుదల చేయగా.. బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు కొంపల్లి మోహన్ రెడ్డి శనివారం ఆంజనేయులకు అందజేశారు.
గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వచ్చిన ఆంజనేయులు ముదిరాజ్‌కు రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
గ్రామ శాఖ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. అనంతరం యువ మోర్చా మండల కార్యదర్శి, జిల్లా కార్యదర్శిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. 2020 నుంచి 2024 వరకు మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపించారు.
ఎన్నికల సమయంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. మేడ్చల్ ప్రాంతంలో పార్టీ కార్యకర్తలను సమన్వయం చేస్తూ సంస్థాగత బలోపేతానికి కృషి చేశారు.
గిర్మాపూర్ ప్రాంతంలో రైతు సహకార సంఘం డైరెక్టర్ల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, కౌన్సిలర్ ఎన్నికల్లోనూ పార్టీ తరఫున సమన్వయం, ప్రచార బాధ్యతలను నిర్వహించారు.
తనకు రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గంలో అవకాశం కల్పించిన అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్యకు, రాజకీయంగా తనను ప్రోత్సహించిన కొంపల్లి మోహన్ రెడ్డికి ఆంజనేయులు ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.
రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని.. వాటి పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తానన్నారు. రైతులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ వాటి ప్రయోజనాలు రైతులకు చేరేలా కృషి చేస్తానని తెలిపారు.

రైతుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేయడంతో పాటు కిసాన్ మోర్చాను గ్రామస్థాయి వరకు మరింత బలోపేతం చేసేందుకు పనిచేస్తానని ఆంజనేయులు ముదిరాజ్ వెల్లడించారు.