అర్ధరాత్రి ఆపదలో ఉన్న తల్లీబిడ్డలకు జగ్గారెడ్డి అండ.. తన కారులో ఎంసీహెచ్‌కు తరలింపు

BC7News
By
1 Min Read

హైదరాబాద్: అర్ధరాత్రి వేళ చంటి బిడ్డ ప్రాణాల కోసం ఆందోళనతో ఆస్పత్రికి చేరుకున్న ఓ తల్లికి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అండగా నిలిచారు. నాలుగు నెలల పసికందుకు ఫిట్స్ రావడంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రవళిక అనే మహిళ రాత్రి ఒంటి గంట సమయంలో ఆటోలో ఆస్పత్రికి చేరుకుంది.

అదే సమయంలో ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తున్న జగ్గారెడ్డి, మహిళల వార్డు సమీపంలో చేతుల్లో చంటి బిడ్డను ఎత్తుకుని ఆందోళనగా నిల్చున్న ప్రవళికను గమనించారు. ఆమెను పలకరించి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రవళిక తన బిడ్డకు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయని, చిన్నారిలో ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో భయపడి ఒంటరిగానే ఆస్పత్రికి వచ్చానని వివరించింది. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న జగ్గారెడ్డి వెంటనే స్పందించారు.

తల్లీబిడ్డలను తన అధికారిక వాహనంలో ఎక్కించుకుని నేరుగా మాతా శిశు ఆస్పత్రి (ఎంసీహెచ్)కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులతో స్వయంగా మాట్లాడి చిన్నారికి అత్యవసర చికిత్స వెంటనే అందేలా చర్యలు తీసుకున్నారు. వైద్య బృందం చిన్నారికి చికిత్స ప్రారంభించింది.

అర్ధరాత్రి అత్యవసర పరిస్థితిలో ప్రజాప్రతినిధి స్వయంగా స్పందించి తల్లీబిడ్డలకు అండగా నిలవడం అక్కడ ఉన్న వారిని కదిలించింది. జగ్గారెడ్డి మానవతా దృక్పథాన్ని పలువురు అభినందించారు. అత్యవసర సమయంలో ఆయన చూపిన చొరవ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

📄 Generate e-Paper Clip
Share This Article