భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. 44 అడుగులకు నీటిమట్టం, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

BC7News
By
1 Min Read

భద్రాచలం: ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భారీగా వరద నీరు చేరుతుండటంతో శుక్రవారం ఉదయం గోదావరి నీటిమట్టం 44 అడుగులకు చేరింది. ప్రస్తుతం 9,74,666 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

వరద ఉద్ధృతికి భద్రాచలం కళ్యాణకట్ట, స్నాన ఘట్టాలు పూర్తిగా నీట మునిగాయి. సాయంత్రానికి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. అవసరమైతే వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు రెవెన్యూ, విపత్తు నిర్వహణ బృందాలు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు గోదావరి ఒడ్డుకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్, మిడ్‌మానేరు, సింగూరు, ఎల్లంపల్లి, జూరాల వంటి ప్రధాన జలాశయాలు నిండుకుండలా మారాయి. కాళేశ్వరం వద్ద కూడా గోదావరి నీటిమట్టం 11.290 మీటర్లకు చేరి ప్రమాద స్థాయికి చేరువలో ప్రవహిస్తోంది. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

image
📄 Generate e-Paper Clip
Share This Article