ఏపీలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు కీలక నిర్ణయం.. తీర్పు రిజర్వ్

BC7News
By
2 Min Read

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై దాఖలైన పిటిషన్ల విచారణ ముగిసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు.. తుది తీర్పును రిజర్వ్ చేసింది. ప్రభుత్వం సమర్పించిన గణాంకాలు, నివేదికలను పరిశీలించిన అనంతరం నిర్ణయం వెల్లడిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 105, జీవో 1065ను సవాల్ చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతానికి మించే అవకాశం ఉందని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు నిర్ణయించడానికి ప్రభుత్వం ఏ గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుందో వివరించాలని కోర్టు కోరింది.

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు ఉద్దేశం, కమిషన్ నిర్వహించిన అధ్యయనం, 34 శాతం కోటాకు సిఫారసు చేయడానికి ఉపయోగించిన గణాంకాలను కోర్టు పరిశీలించింది. కమిషన్ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

image

అలాగే రాష్ట్ర ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కూడా కోర్టు ముందు సమర్పించాలని ధర్మాసనం కోరింది. ఈ సర్వే ఉద్దేశం, అందులో లభించిన గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లను ఎలా నిర్ణయించారనే అంశాలను పరిశీలించనుంది. ప్రభుత్వం సమర్పించిన గణాంకాల ఆధారంగానే 34 శాతం రిజర్వేషన్ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టుకు తెలిపింది.

పిటిషనర్ తరఫున 50 శాతం పరిమితిని ప్రస్తావించగా, ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో పరిస్థితులు, గణాంకాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నట్లు వాదించింది.

ఈ నేపథ్యంలో అన్ని నివేదికలు, గణాంకాలు, ఆధారాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంటూ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పుపై ఆసక్తి నెలకొంది.

📄 Generate e-Paper Clip
Share This Article