బండి సంజయ్ బతుకంతా మతం పేరుతో రాజకీయమే: ఆది శ్రీనివాస్

BC7News
By
1 Min Read

హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్ తన రాజకీయ జీవితమంతా మతం పేరుతో రాజకీయాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా బోనాల పండుగను కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించిందని ఆది శ్రీనివాస్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించిన విషయాన్ని గుర్తుచేశారు. బోనాల ఏర్పాట్లపై బండి సంజయ్ చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవించే లౌకిక ప్రభుత్వమని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. హిందూ ధర్మం, ప్రాచీన ఆలయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోందని చెప్పారు.

ఆలయాల అభివృద్ధికి రూ.2,500 కోట్లు

రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాల మౌలిక వసతుల కోసం ప్రభుత్వం సుమారు రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తోందని ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ ఆలయ పునర్నిర్మాణానికి రూ.250 కోట్లు, బాసరకు రూ.225 కోట్లు, భద్రాచలం అభివృద్ధికి రూ.351 కోట్లు కేటాయించినట్లు వివరించారు.

image

గోదావరి పుష్కరాల అభివృద్ధి పనుల కోసం రూ.1,000 కోట్లు కేటాయించామని చెప్పారు. అదేవిధంగా మొయినాబాద్, వేములవాడలో రూ.197 కోట్లతో ఆధునిక గోశాలలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.

బీజేపీపై సవాల్

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆలయాల అభివృద్ధికి ఇంత భారీ మొత్తంలో నిధులు కేటాయించారా? అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. బండి సంజయ్‌కు నిజంగా రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులకు సహకరించాలని సవాల్ విసిరారు.

📄 Generate e-Paper Clip
Share This Article