అక్టోబర్ 3.. రెండు దేశాల్లో టీమిండియా! చరిత్రలో అరుదైన రోజు

BC7News
By
2 Min Read

ఒకే రోజు.. రెండు దేశాలు.. రెండు భారత జట్లు.. రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు! భారత క్రికెట్ అభిమానులకు 2026 అక్టోబర్ 3 ఓ ప్రత్యేక రోజుగా మారబోతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జపాన్‌లో ఆసియా క్రీడల ఫైనల్‌లో ఓ భారత జట్టు స్వర్ణం కోసం పోరాడుతుంటే.. మరోవైపు భారత్‌లో వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లో మరో టీమిండియా బరిలోకి దిగనుంది.

జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా 2026 ఆసియా క్రీడలు జరగనున్నాయి. పురుషుల క్రికెట్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. భారత్ సెప్టెంబర్ 28న క్వార్టర్ ఫైనల్‌తో టోర్నీని ప్రారంభించనుంది. సెమీఫైనల్స్ అక్టోబర్ 1న, ఫైనల్ అక్టోబర్ 3న జరగనుంది.

image

భారత్ ఫైనల్‌కు చేరితే.. అదే అక్టోబర్ 3న జపాన్‌లో స్వర్ణ పతకం కోసం పోరాడుతుంది. అదే రోజు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ న్యూ చండీగఢ్‌లో జరగనుంది. దీంతో భారత క్రికెట్‌లో ఒకేరోజు రెండు వేర్వేరు దేశాల్లో రెండు జట్లు ఆడే అరుదైన సందర్భం ఏర్పడనుంది.

అయ్యర్‌కు కీలక బాధ్యతలు

ఆసియా క్రీడల్లో భారత టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నాడు. సెప్టెంబర్ 22న జట్టుతో కలిసి జపాన్‌కు వెళ్లనున్న అయ్యర్.. వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు.

ప్రస్తుతం భారత వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న అయ్యర్.. దేశానికి ప్రాతినిధ్యం వహించే ఆసియా క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చాడు.

‘స్వర్ణం గెలుస్తాం’.. బీసీసీఐ అధ్యక్షుడి ధీమా

ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బృందానికి బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మనహాస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రికెట్ జట్లు అత్యుత్తమ ప్రదర్శన చేసి స్వర్ణ పతకాలు సాధిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆటగాళ్ల సన్నద్ధత, కఠోర శ్రమ, ఉత్సాహం చూస్తుంటే దేశానికి కీర్తి తీసుకొస్తారని ధీమా వ్యక్తం చేశారు.

టీమిండియా స్క్వాడ్

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ.

📄 Generate e-Paper Clip
Share This Article