మైనర్ల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ కేసులో సంచలన తీర్పు.. 5 మందికి జీవిత ఖైదు

BC7News
By
1 Min Read

హైదరాబాద్‌లో 2015లో సంచలనం సృష్టించిన మైనర్ల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ కేసులో ప్రత్యేక పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసులో 33 మందిని దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం.. ఐదుగురికి జీవిత ఖైదు విధించింది.

హెచ్‌ఏసీఏ భవన్‌లోని ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఉదయ్ భాస్కర్‌రావు బుధవారం తీర్పు ప్రకటించారు. ఐదుగురికి జీవిత ఖైదు విధించగా.. మరో ముగ్గురికి 14 ఏళ్ల చొప్పున, 14 మందికి 10 ఏళ్ల చొప్పున, మరో 11 మందికి మూడేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధించారు.

బాధితులు ఎదుర్కొన్న శారీరక, మానసిక వేదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. తొమ్మిది మంది మైనర్ బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆదేశించింది.

image

ఉద్యోగం పేరుతో నమ్మించి..

2015 జులై 17న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామానికి చెందిన బాలికకు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించిన కొందరు వ్యక్తులు ఆమెను వ్యభిచార కూపంలోకి నెట్టారు. సుమారు నాలుగు నెలల పాటు అక్కడ తీవ్ర నరకయాతన అనుభవించిన బాలిక.. చివరకు అక్కడి నుంచి తప్పించుకుని సీఐడీ అధికారులను ఆశ్రయించింది.

బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన తెలంగాణ సీఐడీ మహిళా భద్రతా విభాగం.. వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా 45 మందిని అరెస్ట్ చేసి, తొమ్మిది మంది మైనర్లతో పాటు పలువురు మహిళలను రక్షించారు.

నిందితులపై పోక్సో చట్టం, ఐపీసీ, అనైతిక రవాణా నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం 33 మందిని దోషులుగా తేల్చిన కోర్టు.. నిందితులకు కఠిన శిక్షలు విధించింది.

📄 Generate e-Paper Clip
Share This Article