ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచినా బొద్దింకలు కనిపిస్తుంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటిని ఆకర్షించేది కేవలం ఆహారం మాత్రమే కాదు. తేమ, దాక్కునే ప్రదేశాలు, శుభ్రం చేయని కొన్ని మూలలు కూడా బొద్దింకలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తాయి.
వంటగదిలో ఎక్కువసేపు తడిగా ఉండే స్పాంజ్‌లు, గుడ్డలు బొద్దింకలకు ఆశ్రయంగా మారుతాయి. అలాగే స్టవ్ చుట్టూ పేరుకుపోయే నూనె జిడ్డు, ఎగ్జాస్ట్ హుడ్, క్యాబినెట్లపై ఉండే మురికి కూడా వాటికి ఆహారంగా ఉపయోగపడుతుంది.
కార్డ్‌బోర్డ్ పెట్టెల్లో ఆహార పదార్థాలను నిల్వ చేయడం కూడా సరైన పద్ధతి కాదు. అలాంటి పెట్టెల్లో బొద్దింకలు దాక్కోవడమే కాకుండా తేమ కారణంగా అక్కడే నివాసం ఏర్పరుచుకుంటాయి. అందుకే గాలి చొరబడని ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాల్లో నిల్వ చేయడం ఉత్తమం.
ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వాటి ఆహారాన్ని రాత్రంతా అలాగే ఉంచకూడదు. అలాగే ఖాళీ కూల్‌డ్రింక్ డబ్బాలు, జ్యూస్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ బాటిళ్లలో మిగిలిన తీపి పదార్థాలు కూడా బొద్దింకలను ఆకర్షిస్తాయి.

లీకవుతున్న పైపులు, చుక్కలు పడే ట్యాప్‌లు, ఫ్రిజ్ చుట్టూ ఉండే తేమ బొద్దింకలకు నీటి వనరుగా మారుతుంది. అందుకే ఇంట్లో ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలి.
నిపుణుల సూచన ప్రకారం, బొద్దింకల సమస్యను తగ్గించాలంటే వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, చెత్తను నిల్వ ఉంచకుండా బయట వేయడం, ఆహారాన్ని మూత ఉన్న డబ్బాల్లో భద్రపరచడం, తేమ లేకుండా చూసుకోవడం వంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.