పండుగల సీజన్ మొదలుకాకముందే చక్కెర ధరలు వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. దేశీయ మార్కెట్లలో సరఫరా ఒత్తిడి, అంతర్జాతీయంగా ఉత్పత్తి తగ్గే అవకాశాలు, పండుగల నేపథ్యంలో పెరుగుతున్న డిమాండ్ కలిసి ధరలను పైకి నడిపిస్తున్నాయి. ఆగస్టు ప్రారంభం నుంచి కొల్హాపూర్ వంటి ప్రధాన మార్కెట్లలో హోల్‌సేల్ ధరలు దాదాపు 20 శాతం పెరిగినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.
న్యూయార్క్ మార్కెట్‌లో రా షుగర్ ఫ్యూచర్స్ 17.59 సెంట్ల 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. బ్రెజిల్‌లో చెరకును ఇథనాల్ ఉత్పత్తి వైపు మళ్లించడం, భారత్‌లో చెరకు ఉత్పత్తిపై ఆందోళనలు వంటి అంశాలు అంతర్జాతీయ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి.
దేశీయంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో చక్కెర హోల్‌సేల్ ధర క్వింటాల్‌కు రూ.5,350కి చేరింది. పండుగల సీజన్‌లో స్వీట్లు, మిఠాయిల తయారీ పెరగడంతో ఆగస్టు నుంచి నవంబర్ వరకు చక్కెరకు డిమాండ్ సాధారణంగా అధికంగా ఉంటుంది. దీంతో రానున్న రోజుల్లో ధరలపై మరింత ఒత్తిడి ఉండొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

దిగుమతులపై కేంద్రం దృష్టి
పెరుగుతున్న ధరలను అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలను పరిశీలిస్తోంది. పరిమిత స్థాయిలో డ్యూటీ-ఫ్రీ చక్కెర దిగుమతులకు అనుమతి ఇవ్వడం, దిగుమతి సుంకాలను తగ్గించడం, బల్క్ ట్రేడర్ల నిల్వలపై పరిమితులు విధించడం వంటి అంశాలు పరిశీలనలో ఉన్నాయి. దాదాపు పదేళ్ల తర్వాత భారత్ చక్కెర దిగుమతుల వైపు చూడటం మార్కెట్‌లో ప్రాధాన్యం సంతరించుకుంది.
దిగుమతులు, చక్కెర మిల్లుల విక్రయ కోటాల్లో మార్పులు, ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించే చెరకు పరిమాణంపై నిర్ణయాలు వంటి అంశాలపై కేంద్రం తీసుకునే చర్యలే రానున్న రోజుల్లో చక్కెర ధరల దిశను నిర్ణయించనున్నాయి.