సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు సమర్పించిన 1,182.846 కిలోల వెండిని దేవస్థానం అధికారులు హైదరాబాద్‌కు తరలించారు. 2019 నుంచి ఇప్పటివరకు భక్తుల నుంచి అందిన ఈ వెండి విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం సుమారు రూ.23 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆలయంలో భద్రపరిచిన వెండికి సీల్ వేసి, ప్రత్యేక భద్రత మధ్య హైదరాబాద్‌లోని ప్రభుత్వ మింట్‌కు తరలించారు. అక్కడ వెండిని కరిగించి నాణ్యత, స్వచ్ఛత, కచ్చితమైన విలువను నిర్ధారించనున్నారు.
వెండి విలువ నిర్ధారణ అనంతరం దానికి సమానమైన బంగారాన్ని కొనుగోలు చేసి గోల్డ్ బాండ్ల రూపంలో సింహాచలం దేవస్థానం పేరుతో డిపాజిట్ చేయాలనే ప్రతిపాదన ఉంది.
అయితే ఈ వెండిని శ్రీకాళహస్తి దేవస్థానానికి విక్రయించే అంశం కూడా తెరపైకి వచ్చింది. శ్రీకాళహస్తి ఆలయంలో వెండి తాపడం పనులకు సుమారు 500 కిలోల వెండి అవసరం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా విలువను నిర్ధారించి విక్రయించే ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. హైదరాబాద్ మింట్‌లో వెండి విలువ నిర్ధారణ పూర్తైన తర్వాతే గోల్డ్ బాండ్లుగా మార్చాలా? లేక శ్రీకాళహస్తికి విక్రయించాలా? అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.