bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News › కూతురినివ్వలేదని ఇంట్లో భారీ చోరీ! › e-Paper Clip bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 ✉ ✈ in @ 📱 WhatsApp
Date of Publish : 03 Oct 2026, 1:24 pm  |  Posted by : BC7NEWS
👁 5 💬 0
Latest News

కూతురినివ్వలేదని ఇంట్లో భారీ చోరీ!

కూతురినివ్వలేదని ఇంట్లో భారీ చోరీ!

తాను ఇష్టపడిన యువతిని మరొకరికి ఇచ్చి వివాహం చేశారన్న కోపంతో, మేనమామ ఇంట్లోనే చోరీకి పాల్పడిన యువకుడిని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు.

బెల్లంపల్లి కాంట్రాక్టర్స్ కాలనీకి చెందిన మహమ్మద్ మగ్దూమ్ అనే వెల్డర్, ఇందారం మండలం కాసింపల్లి గ్రామంలోని తన మేనమామ షేక్ సలీం కుమార్తెను వివాహం చేసుకోవాలని భావించాడు. అయితే, సలీం తన కుమార్తెకు వేరొకరితో పెళ్లి జరిపించడంతో మగ్దూమ్ మేనమామపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 28న సలీం కుటుంబం సభ్యులు తమ కుమారుడి వివాహం నిమిత్తం బట్టలు కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ వెళ్లారు.

ఇదే అదనుగా భావించిన మగ్దూమ్, తన స్నేహితుడు సబ్బని లక్ష్మీనారాయణతో కలిసి సలీం ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. బీరువాలో ఉన్న రూ.60,000 నగదు, బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించారు. అనంతరం పక్కనే ఉన్న మరో మేనమామ ఖాజా పాషా ఇంట్లో కూడా వీరు చోరీకి పాల్పడ్డారు. దొంగిలించిన నగదులో మగ్దూమ్ రూ. 35,000, లక్ష్మీనారాయణ రూ. 25,000 పంచుకోగా, ఆ సొమ్మును హైదరాబాద్‌లో జల్సాలకు ఖర్చు చేశారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి ఇందారం ఎక్స్ రోడ్ వద్ద మగ్దూమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 6 తులాల బంగారం, 45 తులాల వెండి ఆభరణాలు, రూ. 13,300 నగదు, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు లక్ష్మీనారాయణ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.