bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking Newsకొండా సురేఖపై వేటు? మంత్రి పదవి నుంచి తొలగింపుపై కాంగ్రెస్‌లో… › e-Paper Clip bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 22 Aug 2026, 7:32 am  |  Posted by : BC7NEWS
👁 3 💬 0
Latest News

కొండా సురేఖపై వేటు? మంత్రి పదవి నుంచి తొలగింపుపై కాంగ్రెస్‌లో కీలక చర్చ

కొండా సురేఖపై వేటు? మంత్రి పదవి నుంచి తొలగింపుపై కాంగ్రెస్‌లో కీలక చర్చ

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆమె కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు, పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అంశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై అధికారిక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ను అహంకారిగా అభివర్ణిస్తూ.. తెలంగాణ కాంగ్రెస్‌ను ‘తెలుగుదేశం కాంగ్రెస్‌’గా మార్చేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

దీనికి సురేఖ స్పందిస్తూ.. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అయితే, కుమార్తె వ్యాఖ్యలను ఆమె బహిరంగంగా ఖండించకపోవడం, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న కొన్ని కార్యక్రమాలకు గైర్హాజరు కావడం పార్టీలో చర్చకు దారితీసింది.

ఇదే సమయంలో ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలకు చెందిన సుమారు 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై సురేఖపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించవద్దని ప్రభుత్వ విప్ బీర్ల ఇలయ్య, ఎమ్మెల్యే వేముల వీరేశం తదితరులు కోరినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాతే తదుపరి పరిణామాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.