తెలంగాణలో ఆహారం, ఔషధాల నాణ్యతను పర్యవేక్షించడంతో పాటు కల్తీ, నకిలీ ఉత్పత్తులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వేర్వేరుగా పనిచేస్తున్న ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ విభాగాలను విలీనం చేసి ‘టీజీ సేఫ్’ (Telangana Standards Authority for Food and Essential Drugs) పేరుతో ఏకీకృత పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
‘టీజీ సేఫ్’ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి అవినాశ్ మహంతిని నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ మరో ఉత్తర్వు విడుదల చేసింది. ఆయన గతంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు.
రాష్ట్రంలో ఆహార వ్యాపార కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో నాణ్యత లేని, నకిలీ ఆహార పదార్థాలు, ఔషధాలను నియంత్రించి ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్-1940 కింద నిబంధనల అమలు, పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడమే విలీనం లక్ష్యమని స్పష్టం చేసింది.
కొత్త వ్యవస్థలో డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఫుడ్ సేఫ్టీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, లీగల్ అండ్ ప్రాసిక్యూషన్, లేబొరేటరీ, అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు పనిచేయనున్నాయి. అయితే సంబంధిత చట్టాల ప్రకారం అధికారులు కలిగి ఉన్న చట్టబద్ధ అధికారాలు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది.
నియంత్రణ వ్యవస్థను ఆధునికీకరించేందుకు రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. సర్వీస్ రూల్స్ సమన్వయం, క్షేత్రస్థాయి యూనిట్ల బలోపేతం, ప్రయోగశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై కమిటీ అధ్యయనం చేయనుంది. జాతీయ, అంతర్జాతీయ ఉత్తమ విధానాలకు అనుగుణంగా పటిష్ఠమైన నియంత్రణ వ్యవస్థను రూపొందించేందుకు ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది.