bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking NewsGodavari Pushkaralu 2027: తెలంగాణలో రూ.1000 కోట్లతో భారీ ఏర్పాట్లు › e-Paper Clip bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 15 Aug 2026, 6:29 am  |  Posted by : BC7NEWS
👁 5 💬 0
Latest News

Godavari Pushkaralu 2027: తెలంగాణలో రూ.1000 కోట్లతో భారీ ఏర్పాట్లు

Godavari Pushkaralu 2027: తెలంగాణలో రూ.1000 కోట్లతో భారీ ఏర్పాట్లు

హైదరాబాద్: గోదావరి పుష్కరాలు-2027ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు, రవాణా, భద్రత, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ముందస్తు చర్యలు చేపడుతోంది. పుష్కరాల ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించినట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.

సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు. సెప్టెంబర్ మొదటి వారంలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, ఆగస్టు నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను టైర్-1 ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. రద్దీ నియంత్రణ, అత్యవసర పరిస్థితుల నిర్వహణ కోసం కీలక ప్రాంతాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు.

పుష్కరాల పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పనులు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా సీనియర్ అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు దేవాదాయ శాఖ ప్రత్యేక డాష్‌బోర్డ్ ఏర్పాటు చేయాలని సూచించారు.

భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారుల అనుసంధానాన్ని మెరుగుపరచాలని మంత్రి తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి స్థానిక నిధులతో అవసరమైన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.

పుష్కరాల నిర్వహణలో స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు, పండితులను భాగస్వాములను చేయాలని సూచించారు. భక్తులకు సేవలందించేందుకు ఆసక్తి చూపే స్వచ్ఛంద, ప్రైవేట్ సంస్థలను ముందుగానే గుర్తించి సమన్వయం చేసుకోవాలని తెలిపారు.

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో ఏ శాఖ కూడా నిర్లక్ష్యం వహించరాదని మంత్రి హెచ్చరించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించగలమని పేర్కొన్నారు.