bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News2047 నాటికి వికసిత్ భారత్.. ఉగ్రవాదంపై రాజీపడే ప్రసక్తే లేదు:… › e-Paper Clip bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 15 Aug 2026, 5:23 am  |  Posted by : BC7NEWS
👁 8 💬 0
Latest News

2047 నాటికి వికసిత్ భారత్.. ఉగ్రవాదంపై రాజీపడే ప్రసక్తే లేదు: రాష్ట్రపతి ముర్ము

2047 నాటికి వికసిత్ భారత్.. ఉగ్రవాదంపై రాజీపడే ప్రసక్తే లేదు: రాష్ట్రపతి ముర్ము

న్యూఢిల్లీ: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. గత దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు, అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ వేగవంతమైన ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సాధించిందని ఆమె అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

దేశ భద్రత విషయంలో భారత్ అనుసరిస్తున్న కఠిన వైఖరిని రాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ భారత సాయుధ దళాల అసమాన ధైర్యసాహసాలకు, సాంకేతిక సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వారి చర్యలకు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశంతో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయమని రాష్ట్రపతి తెలిపారు. ముఖ్యంగా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

పేదరిక నిర్మూలన, ఆర్థిక సమ్మిళితం

గత పదేళ్లలో దేశం అభివృద్ధి, వారసత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిందని ముర్ము అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు పేదరికం నుంచి బయటపడినట్లు తెలిపారు.

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన వంటి పథకాల ద్వారా బ్యాంకింగ్ సేవలు సామాన్య ప్రజలకు చేరువయ్యాయని చెప్పారు. మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెరగడంతో దేశంలో ఉపాధి, పెట్టుబడి అవకాశాలు కూడా విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు.

యువతే దేశ భవిష్యత్

యువత దేశ ప్రగతికి ప్రధాన చోదక శక్తిగా నిలుస్తోందని రాష్ట్రపతి అన్నారు. స్టార్టప్‌లు, సాంకేతిక రంగాల్లో యువత ప్రతిభను ప్రశంసించారు. పరీక్షా వ్యవస్థలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తామని, పేపర్ లీక్ వంటి ఘటనలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని యువతకు భరోసా ఇచ్చారు.

మహిళల రాజకీయ, సామాజిక భాగస్వామ్యం పెరగడం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ప్రస్తావిస్తూ వివిధ రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలను అభినందించారు.

మావోయిజం నిర్మూలన చారిత్రాత్మకం

దేశ అంతర్గత భద్రతలో మావోయిజం నిర్మూలనను రాష్ట్రపతి కీలక విజయంగా అభివర్ణించారు. గతంలో మావోయిజం ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ధి, క్రీడలు, సామాజిక కార్యక్రమాలు విస్తరిస్తున్నాయని చెప్పారు.

‘ఖేలో ఇండియా’ వంటి కార్యక్రమాలతో దేశ క్రీడా వ్యవస్థ బలోపేతమవుతోందని, అంతర్జాతీయ వేదికలపై భారత క్రీడాకారుల ప్రదర్శన మెరుగుపడుతోందని తెలిపారు.

ప్రజల భాగస్వామ్యంతోనే వికసిత్ భారత్

జాతీయ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. సహజ వనరులను భవిష్యత్ తరాల కోసం పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వంటి జాతీయ నాయకుల సేవలను స్మరించుకున్న రాష్ట్రపతి.. దేశ సమైక్యత, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని సూచించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడం ప్రతి భారతీయుడి సమష్టి బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.