పాతబస్తీ విద్యుత్ బిల్లుల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
పాతబస్తీలో మైనారిటీలు విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడం, వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం వంటి అంశాలపై సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో పేద హిందువుల ఇళ్లపై హైడ్రా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. విద్యుత్ బిల్లుల విషయంలో మాత్రం మైనారిటీల పట్ల సానుభూతి ఎందుకు చూపిస్తోందని నిలదీశారు.
పేద హిందూ కుటుంబాలను హైడ్రా పేరుతో వేధిస్తూ.. మైనారిటీలు బిల్లులు చెల్లించకపోవడాన్ని సమర్థించేలా మాట్లాడటం కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని చూపిస్తోందని రాంచందర్ రావు విమర్శించారు.
మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు హిందువుల ప్రయోజనాలను పణంగా పెట్టే రాజకీయాలను కాంగ్రెస్ చాలా కాలంగా కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు. ఖిలాఫత్ ఉద్యమం నాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల్లో మార్పు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.