సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో సత్వార్ గ్రామ పరిసర ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామ సమీపంలోని యూ-టర్న్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదం తీవ్రతకు ఆటోలో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 14 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా కర్ణాటకలోని బీదర్ జిల్లా రాజగిరి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఉపాధి కోసం జహీరాబాద్ పరిసర ప్రాంతాలకు కూలి పనులకు వచ్చినట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణం ట్యాంకర్ అతివేగమా, డ్రైవర్ నిర్లక్ష్యమా అనే కోణంలో విచారణ చేపట్టారు.
మరోవైపు ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఒకే ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడంతో మృతుల స్వగ్రామమైన రాజగిరిలోనూ విషాద వాతావరణం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.