bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking Newsలాల్‌దర్వాజ బోనాలు.. అంగరంగ వైభవంగా అమ్మవారి ఘటాల ఊరేగింపు › e-Paper Clip bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 11 Aug 2026, 7:14 am  |  Posted by : BC7NEWS
👁 8 💬 0
Latest News

లాల్‌దర్వాజ బోనాలు.. అంగరంగ వైభవంగా అమ్మవారి ఘటాల ఊరేగింపు

లాల్‌దర్వాజ బోనాలు.. అంగరంగ వైభవంగా అమ్మవారి ఘటాల ఊరేగింపు

హైదరాబాద్‌: లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం నిర్వహించిన అమ్మవారి ఘటాల, అంబారీ ఊరేగింపునకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో లాల్‌దర్వాజ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

అమ్మవారి ఘటాలను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించగా.. ఫలహారం బండ్లను పొట్టేళ్లతో ఊరేగించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. లాల్‌దర్వాజ అధికారిక పోతరాజు అశ్విన్‌ ముదిరాజ్‌ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవతామూర్తుల వేషధారణలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకలకు మరింత కళను తీసుకొచ్చాయి.

లాల్‌దర్వాజ ఆలయం వద్ద పచ్చికుండపై మాతంగి అనురాధ రంగం నిర్వహించి భవిష్యవాణి వినిపించారు. ప్రజలు భక్తితో చేసే పూజల వల్ల దేశం సుభిక్షంగా ఉంటోందని ఆమె అన్నారు. ఆలయ విస్తరణ పనులు చేపట్టాలని కోరారు.

ప్రస్తుతం కాలికాలం కొనసాగుతున్నందున అనుకోని సంఘటనలు జరుగుతున్నాయని, చిన్నారులపై దారుణాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామగ్రామాన తాను కొలువై ఉన్నానని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

భక్తులతో కిక్కిరిసిన ఊరేగింపు మార్గం

ఘటాల ఊరేగింపు ఉప్పుగూడ నుంచి ప్రారంభమై ఛత్రినాక, గౌలిపుర, లాల్‌దర్వాజ మోడ్‌, చార్మినార్‌, నయాపూల్‌, ఢిల్లీ దర్వాజ వరకు కొనసాగింది. ప్రధాన మార్గాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో చేరడంతో పండుగ వాతావరణం నెలకొంది.

ఉప్పుగూడలో టిల్లు తల్వార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫలహారం బండిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించుకున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.