bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking Newsఆచార్య జయశంకర్ జయంతి.. రాష్ట్రవ్యాప్తంగా ఘన నివాళులు › e-Paper Clip bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 06 Aug 2026, 2:09 pm  |  Posted by : BC7NEWS
👁 9 💬 0
Andhra Pradesh > Telangana > Telangana Politics

ఆచార్య జయశంకర్ జయంతి.. రాష్ట్రవ్యాప్తంగా ఘన నివాళులు

ఆచార్య జయశంకర్ జయంతి.. రాష్ట్రవ్యాప్తంగా ఘన నివాళులు

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం నివాళి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వాన్ని ఈ సందర్భంగా నేతలు స్మరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సందేశంలో జయశంకర్ ప్రత్యేక తెలంగాణ కోసం జీవితాంతం అంకితభావంతో కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని గణాంకాలతో దేశానికి వివరించి, ఆరు దశాబ్దాల పాటు ఉద్యమ స్ఫూర్తిని సజీవంగా ఉంచారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కార్యరూపంలోకి తీసుకురావడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా జయశంకర్ సేవలను గుర్తుచేస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధనే ఆయన జీవిత లక్ష్యమని పేర్కొన్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్‌కు ఆయన గురువుతో సమానమని, తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడిగా అభివర్ణించారు. ఆయన సేవలకు గుర్తింపుగా భూపాలపల్లి జిల్లాకు, వ్యవసాయ కళాశాలకు జయశంకర్ పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నేతలు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి నివాళులర్పించారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా జయశంకర్‌ను స్మరించారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేయడంలో ఆయన పాత్ర చారిత్రాత్మకమని, ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు.

ఇదిలా ఉండగా, ఎమ్మెల్సీ కవిత నాయకత్వంలోని తెలంగాణ రక్షణ సేన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో బహిరంగ సభ నిర్వహిస్తోంది. జయశంకర్‌కు ఘన నివాళులర్పించడంతో పాటు రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేయాలని ఈ సభ ద్వారా డిమాండ్ చేయనుంది.