bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking Newsఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకి భారీ షాక్.. ఖాతాదారుడికి రూ.3.20… › e-Paper Clip bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 31 Jul 2026, 10:39 am  |  Posted by : BC7NEWS
👁 5 💬 0
Latest News

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకి భారీ షాక్.. ఖాతాదారుడికి రూ.3.20 లక్షలు చెల్లించాలన్న కమిషన్

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకి భారీ షాక్.. ఖాతాదారుడికి రూ.3.20 లక్షలు చెల్లించాలన్న కమిషన్

ఖాతాదారుడికి చెందిన విలువైన ఆస్తి పత్రాలను పోగొట్టినందుకు State Bank of India (ఎస్బీఐ)పై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకు నిర్లక్ష్యం వల్ల తీవ్ర మానసిక వేదనకు గురైన బాధితుడికి రూ.3 లక్షల నష్టపరిహారంతో పాటు వ్యాజ్య ఖర్చుల కింద మరో రూ.20 వేల చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.

ఇబ్రహీంపట్నం మండలం బొంగులూరుకు చెందిన బి. వెంకటేశం ఎస్బీఐ ఆదిభట్ల బ్రాంచ్‌లో రూ.5 లక్షల గృహ రుణం తీసుకున్నారు. రుణానికి అదనపు భద్రతగా తన బంధువు అంజయ్యకు చెందిన 194 చదరపు గజాల ప్లాట్‌కు సంబంధించిన ఒరిజినల్ సేల్ డీడ్‌తో పాటు ఇతర లింక్ డాక్యుమెంట్లను బ్యాంకులో జమ చేశారు. మార్చి 2022లో రుణాన్ని పూర్తిగా తీర్చేసి నో-డ్యూస్ సర్టిఫికేట్ కూడా పొందారు.

అయితే అసలు పత్రాలు తిరిగి ఇవ్వాలని కోరగా బ్యాంకు అధికారులు తొలుత సెంట్రలైజేషన్ ప్రక్రియ జరుగుతోందని, త్వరలో అందజేస్తామని చెప్పి కాలయాపన చేశారు. అనంతరం పత్రాలు కనిపించడం లేదని వెల్లడించడంతో బాధితుడు షాక్‌కు గురయ్యారు. రెండేళ్లపాటు బ్యాంకు చుట్టూ తిరిగినా పరిష్కారం లభించకపోవడంతో చివరకు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

విచారణలో ఎస్బీఐ తమవైపు సేవల లోపం లేదని, పత్రాల గల్లంతుపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, ప్రత్యామ్నాయ పత్రాల కోసం పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని వాదించింది. అయితే బ్యాంకు వాదనలను కమిషన్ తోసిపుచ్చింది. పత్రాల భద్రతలో స్పష్టమైన నిర్లక్ష్యం కనిపిస్తోందని పేర్కొంటూ బాధితుడికి మొత్తం రూ.3.20 లక్షలు చెల్లించాలని ఎస్బీఐకి ఆదేశాలు జారీ చేసింది.