bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking Newsభోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ముస్తాబు.. ఆగస్ట్ 1న మోదీ చేతుల మీదుగా… › e-Paper Clip bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 28 Jul 2026, 6:00 am  |  Posted by : BC7NEWS
👁 5 💬 0
Latest News

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ముస్తాబు.. ఆగస్ట్ 1న మోదీ చేతుల మీదుగా ప్రారంభం

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ముస్తాబు.. ఆగస్ట్ 1న మోదీ చేతుల మీదుగా ప్రారంభం

విశాఖపట్నం సమీపంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆగస్ట్ 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధిలో కీలక ఘట్టమని ఆయన పేర్కొన్నారు.

అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా పేరుపొందిన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతుందని సీఎం తెలిపారు. ప్రపంచ స్థాయి సదుపాయాలతో నిర్మితమైన ఈ ఎయిర్‌పోర్ట్ రాష్ట్ర విమానయాన రంగానికి మరింత బలం చేకూర్చడంతో పాటు అంతర్జాతీయ కనెక్టివిటీని విస్తరించనుందని చెప్పారు.

విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల పెట్టుబడులు పెరగడంతో పాటు పారిశ్రామిక రంగం, పర్యాటకం, వాణిజ్య రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు.

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. గిరిజనుల సంప్రదాయ థింసా నృత్యం, శాస్త్రీయ నృత్యరూపమైన కూచిపూడి ప్రదర్శనలను ప్రత్యేక ఆకర్షణగా నిలపాలని చెప్పారు.

30 వేల మంది కళాకారులతో నిర్వహించే థింసా నృత్యాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డు స్థాయిలో నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా కృషి చేయాలని సూచించారు.

అలాగే అరకు కాఫీ, గిరిజన ఉత్పత్తులు, స్థానిక హస్తకళలు, విశాఖపట్నం, అరకు లోయ, బొర్రా గుహలు వంటి పర్యాటక ప్రాంతాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ చేయాలని సీఎం ఆదేశించారు.

భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోని ప్రముఖ విమానయాన కేంద్రాల్లో ఒకటిగా నిలబెట్టే దిశగా ఇది కీలక అడుగుగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.