మహారాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్, శివసేన (మహాయుతి) నేత సచిన్ అహిర్ ముంబై వర్లీ నివాసంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోని బంగారు ఆభరణాలు, బంగారు బిస్కట్లు, వజ్రాభరణాలు, వెండి వస్తువులు, నగదు కలిపి దాదాపు రూ.2.65 కోట్ల విలువైన సొత్తు చోరీకి గురైంది.
ఈ కేసులో 45 ఏళ్ల ప్రవీణ్ రమేశ్ సోలంకిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 20 ఏళ్లుగా అహిర్ కుటుంబంతో కలిసి పనిచేస్తున్న అతడు.. ఇంట్లో విలువైన వస్తువులను ఎక్కడ భద్రపరుస్తారో తెలుసుకున్నాడు. ఈ పరిజ్ఞానంతో గత మూడేళ్లుగా ఎవరికీ అనుమానం రాకుండా కొద్దికొద్దిగా బంగారం, ఇతర విలువైన వస్తువులను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు.
గత వారం ఓ విలువైన ఆభరణం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. లాకర్లు, ఇతర పెట్టెలను పరిశీలించగా భారీ మొత్తంలో విలువైన వస్తువులు మాయమైనట్లు గుర్తించారు. సచిన్ అహిర్ కుమారుడు కృష్ణ ఫిర్యాదుతో వర్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు.
నిందితుడు ఓ నగల వ్యాపారికి విక్రయించిన 325 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన సొత్తును విక్రయించి వచ్చిన డబ్బును తన అనుచరులతో పంచుకున్నట్లు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురు గృహ కార్మికుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రవీణ్ సోలంకిని కోర్టులో హాజరుపరచగా జులై 28 వరకు పోలీస్ కస్టడీ విధించారు.