న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2024 నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా అనుమానించిన సంజీవ్ కుమార్ అలియాస్ సంజీవ్ ముఖియాపై ఆరోపణలను నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవని సీబీఐ తేల్చింది. దీంతో ఆయనపై చార్జ్‌షీట్ దాఖలు చేయకుండా క్లీన్‌చిట్ ఇచ్చింది.
నాటి నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై బీహార్ పోలీసులు తొలుత దర్యాప్తు చేశారు. పేపర్ చోరీ, పంపిణీ వ్యవహారంలో సంజీవ్ కుమార్ సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీయడంతో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తును సీబీఐకి అప్పగించింది.
కేసు దర్యాప్తులో భాగంగా పాట్నా సీబీఐ కోర్టులో మొత్తం 45 మందిపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అయితే ప్రశ్నపత్రం చోరీ లేదా పంపిణీలో సంజీవ్ కుమార్ పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని సీబీఐ స్పష్టం చేసింది.
మరోవైపు ఈ కేసులో బెయిల్ పొందిన సంజీవ్ కుమార్.. ఇతర కేసుల్లో నిందితుడిగా ఉండటంతో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. నీట్ పేపర్ లీక్ కుట్రలో పాల్గొన్న వారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని సీబీఐ వెల్లడించింది.